సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఆరుగురిపై కేసు నమోదు
మహానది వెబ్ న్యూస్ ,11/11/2024, హైదరాబాద్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన తప్పుడు ప్రచార వ్యవహారంలో వేములవాడ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడైన ఎండీ యూసుఫ్ పై అవాస్తవ ఆరోపణలతో బ్రోచర్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, వేములవాడకు చెందిన కొల్లూరు శ్రీనివాస్, బొద్దుల బాలకృష్ణ, గున్నాల నరేష్, ఖమ్మం కి చెందిన రమాకాంత్, కొలగని చందు, దూస రాజేందర్ లు యూసుఫ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్పింగ్ చేసిన ఫోటోలతో బ్రోచర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపి, ఐపీసీ సెక్షన్ 296బి, 352, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో సరిహద్దులను స్పష్టం చేస్తూ, న్యాయపరంగా చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో చాటిచెబుతోంది.
