హైదరాబాద్, మహానది న్యూస్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిత్యహోమియోపతి కాచిగూడ లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ గన్నంరాజు దుర్గాప్రసాద్ రావు మాట్లాడుతూ , ప్రజల్లో మానసిక ఆరోగ్యం, మానసిక స్థితి పట్ల అవగాహన కల్పించి, మానసిక ఆరోగ్య విద్యను ప్రోత్సహిస్తూ మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతతో పాటు చుట్టూ ఉన్న అపోహలను తొలగించడం కోసం ఈరోజు వివిధ కార్యక్రమాలు జరుపుకుంటారని, ఇది మన భావోద్వేగ, మానసిక మరియు సమాజ శ్రేయస్సులతో కూడి, మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా అనుభూతి చేందుతామో, ఎలా ప్రవర్తిస్తామో ? అవి మనపై ప్రభావం చూపుతాయని తెలిపారు. మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల తద్వారా ఏర్పడే వైకల్యాలు అనేకం ఉన్నాయన్నారు. ఉదాహరణకు ఆందోళన, నిరాశ, మానసిక సమతుల్యత లోపించిన రుగ్మతలు, ఉన్మాదం, మతి భ్రమణం, భయ భ్రాంతులు, నిద్ర రుగ్మత, న్యూనతాభావం, వ్యసనం ము.వి, ఎంతో మందిని వేధించే ప్రధాన మానసిక సమస్యలని పేర్కొన్నారు. మానసికంగా బాగా లేకపోవడం ఒక సామాజిక కళంకంగా భావించి చాలామంది వైద్యుడిని సంప్రదించడానికి ముందుకురాకపోగా, కొంతమంది చికిత్సను మధ్యలో ఆపేయడం వల్ల కొన్నిసార్లు సమస్య తీవ్రతరమవుతుందని ఆవేదన చెందారు. వైద్యుల సూచనలతో పాటు , కుటుంబ సభ్యుల సహకారం ఉన్నట్లయితే చికిత్సతో మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేశారు.
మానసిక అనారోగ్యానికి హోమియోపతి వైద్య చికిత్స ఎంతో అనువైనదని, ఈ విధానంలో రోగి శారీరక, మానసిక లక్షణాల తో వ్యక్తిగతీకరణ, రోగ లక్షణాల సారూప్యత సిద్ధాంతం పై ఆధారపడి చికిత్స చెయ్యడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. హోమియోపతి చికిత్స లో తక్కువ మోతాదులో ఔషధం వాడడం, ఆసుపత్రిలో ఎక్కువ కాలం లేదా అసలు ఉండాల్సిన అవసరం లేకపోవడం, ఔషధాలు ఎక్కువ కాలం వాడుకునే అవకాశం ఉండడం, ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా, ఇతర సంప్రదాయ వైద్య విధానాలతో కలిపి వాడుకోవడం వంటి బహుళ ప్రయోజనాలు ఉండటం వల్ల అన్ని రకాల మానసిక సమస్యలకు ఉత్తమమైన ఏకైక చికిత్స హోమియోపతి అనడంలో సందేహం లేదని అర్హత కలిగిన హోమియో వైద్యుడిని సంప్రదించి క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే ఖచ్చితమైన, మెరుగైన ఫలితాలు ఉంటాయని డాక్టర్ దుర్గాప్రసాద్ రావు తెలియజేసారు.
