మణుగూరు, మహానది న్యూస్, డిసెంబర్ 22:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని తోగుగూడెం వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం అయింది. సుమారు పదహారు లక్షల పది వేల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
నమ్మదగిన సమాచారం మేరకు డిసెంబర్ 22 న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఎస్.ఐ ఎం. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తోగుగూడెం సమీపంలోని సమ్మక్క–సారక్క దేవాలయం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సీలేరు, భద్రాచలం మార్గంగా వస్తున్న తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారును ఆపి తనిఖీ చేయగా, కారు డిక్కీలో ఇరవై నాలుగు ప్యాకెట్ల నిషేధిత గంజాయి లభ్యమైంది.
ఈ ఘటనలో మారుపాక యుగంధర్ అలియాస్ బాబు, మచ్చ క్రాంతి కుమార్, దుద్దుకుంట విజయభాస్కర్ రెడ్డి అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సీలేరు సమీపంలోని చిత్రకొండ వద్ద సుంద్ర సుందర్ రావు అనే వ్యక్తి నుంచి ముప్పై మూడు కిలోల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంతానికి తరలించి అధిక ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.
పోలీసులు గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

