అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం – కోడిపందాలు, పేకాటకు చెక్
భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, జనవరి 10:
జిల్లాలో కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిరంతర వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించిన కీలక ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
పేకాట, కోడిపందాలు నిర్వహించే వారిని గుర్తించి వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే తక్షణమే పోలీస్ శాఖకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతోందని ప్రకటనలో పేర్కొన్నారు.

