జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి
-రైల్ నిలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా
-రైల్వే జీఎం కు జర్నలిస్టు సంఘాల వినతి.
మహానది, హైదరాబాద్ బ్యూరో,జనవరి 19:
జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ జర్నలిస్టులు గురువారం సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం (రైల్ నిలయం) ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యుజె), తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులు… కరోనా కంటే ముందు వరకు కొనసాగిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను ఆ తరువాత ఎత్తివేయడం పట్ల మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల రైల్వే పాస్ కొనసాగించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది.ఈ సందర్బంగా 50 శాతం రాయితీ కొనసాగించాలని కోరారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు కేంద్రం ఇపుడు కొత్తగా ఇచ్చేది కాదని, ఏండ్ల తరబడి కొనసాగుతూ వచ్చిన రైల్వే పాస్ లను ఇప్పుడు తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. హెచ్ యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్ లను కేంద్రం పునరుద్దరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. హెచ్ యూజే కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్ రాయితీల విషయంలో కేంద్రం తీరు సరైంది కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఇ. చంద్ర శేఖర్ మాట్లాడుతూ చిన్న మధ్య తరగతి జర్నలిస్టుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ఎంపీలు ఈ విషయమై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మెరుగు చంద్ర మోహన్, నాయకులు రఘు, గండ్ర నవీన్, రాజశేఖర్, సలీమా, నాగవాణి, సుభాష్ , వీరేష్ తదితరులు పాల్గొన్నారు.