కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే రేగా కాంతరావు
పినపాక నియోజకవర్గం, జనవరి 19(మహానది ప్రతినిది): మణుగూరు మండలం కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో హరిజనవాడ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు గురువారం నాడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా కాంతరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో తలపెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని అన్నారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయ్యిందనీ, ఈసారి దానిని మించి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని అధికారులను అదేశించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని అన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను కళ్ళజోడు ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు పంచాయతీ సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
