- ప్రకృతి పైనే మానవ మనుగడ
- ఆయుర్వేద జాతీయ సదస్సులో డాక్టర్ జమాల్ ఖాన్
భద్రాద్రి కొత్తగూడెం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఈనెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజులు పాటు జరిగిన పారంపర్య వైద్య మాహా సంఘం ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యుల జాతీయ సదస్సు చివరి రోజు బుధవారం ఘనంగా ముగిసింది. తొలుత పారంపర్య ఆయుర్వేద వైద్య సంఘం ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ నుండి 150 మీటర్ల జాతీయ జెండాను ఊరేగింపుగా ప్రదర్శించారు. ప్రకృతిలో అందుబాటులో ఉండే మొక్కలు పండ్లు మనిషి జీవితంలో ముడిపడి ఉన్నాయంటూ ప్రకృతిని కాపాడండి ఆరోగ్యంగా ఉండండి. మొక్కలు నాటండి మానవ మనుగడ కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం ఎస్వి యూనివర్సిటీ భవనంలో జ్యోతి ప్రతి ప్రజ్వలన చేశారు. ఈ సభకు ఎన్ సావిత్రమ్మ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ జాతీయ సదస్సుకు ఆయుర్వేద వైద్యంలో దిట్ట అయిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు ఆరోగ్య సమస్యలను అందుబాటులో ఉండే వనమూలికలను ఉపయోగించుకొని ఎన్నో దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేసుకున్నారన్నారు. నేటి కాలంలో రోజురోజుకు వాతావరణంలో వచ్చే మార్పులు ప్రజలు తీసుకునే ఆహారం కలుషితమై అనేక రోగాలకు మన శరీరాలు ఆలావాటై ఉన్నాయన్నారు. నేడు ఇంగ్లీషు మందులపై ఆధారపడి వాటిని వాడి దుష్ఫలితాలను పొందుతూ రోగులు చివరకు ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో ఆయుర్వేదంకు సంబంధించిన ఔషధ మొక్కలను పెంచి భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలన్నారు. నేడు చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు అనేక మంది రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని, రోగాలను ఎదుర్కోవాలంటే నేడు ఆయుర్వేదం ఒక్కటే శాశ్వత పరిష్కారం అని అన్నారు. సాంప్రదాయ వైద్యం మన ఇంటి నుండే ప్రారంభమైందని మనం వంటింట్లో వాడే ప్రతి వస్తువు ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నాయన్నారు. ఆయుర్వేదం పై అవగాహన పెంచుకొని ఆరోగ్య నియమాలను పాటిస్తూ దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం కుంటుబడితే ఎన్ని కోట్లు ఉన్నా మానసిక ప్రశాంత ఉండదన్నారు. పర్యావరణ కాలుష్యంతో రోజురోజుకు ప్రకృతిలో పచ్చదనం దూరమై మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సాంప్రదాయ వైద్యం తెలిసినప్రతి ఒక్కరూ వారికి తెలియని విషయాలను అందుబాటులో ఉన్న సీనియర్ ఆయుర్వేద వైద్యులను సంప్రదించి చికిత్స విధానాన్ని తెలుసుకోవాలని సూచించారు. అనంతరం పారంపర్య వైద్య మహా సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ సావిత్రమ్మ జమాల్ ఖాన్ ను శాలువాతో సత్కరించి మెమొంటో, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ జాతీయ మహాసభకు ఆయుర్వేద వైద్య కళాశాల తిరుపతి డాక్టర్ మురళీకృష్ణ. సాంప్రదాయ వైద్యులు ఆనందయ్య. కమ్యూనిటీ హెల్త్ క్లినికల్ రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ టిడిపి బెంగళూరు చెందిన హరిరామ్ మూర్తి, ఎస్ సుభానందం. అక్బర్ ఖాన్. కర్ణాటకకు చెందిన మహాదేవ్. కేరళకు చెందిన శివానందం. మరియు సాంప్రదాయ వైద్యులను ఘనంగా సత్కరించారు