రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోండి  డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ శ్రీ ఎన్ బలరామ్

మహానది న్యూస్  సింగరేణి భవన్, జులై 10, 2023,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు రామగుండంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజ్(సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో సింగరేణికి ప్రత్యేకించిన 5 శాతం రిజర్వేషన్ కోట కింద 7 సీట్లు పొందడం కోసం సింగరేణి ఉద్యోగులు, అధికారుల పిల్లలు ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ శ్రీ ఎన్.బలరామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రామగుండంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పేరు పెట్టడం తో పాటు ఆ కళాశాలలో 5 శాతం సీట్లను సింగరేణి పిల్లలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 75 ను ఈనెల 4వ తేదీన విడుదల చేసిందని, ఈ సదవకాశాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే పొందవచ్చని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించినట్లు తెలియజేశారు. ఐదు శాతం రిజర్వేషన్ కింద సింగరేణి కార్మికుల పిల్లలకు ఏడు సీట్లు లభిస్తాయని, ఈ సీట్లను జాతీయ స్థాయి నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన వారిలో అత్యుత్తమ ర్యాంకు తో పాటు ఎస్.సి., ఎస్. టి., బి.సి., రిజర్వేషన్ వర్తింపజేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు సీట్లు కేటాయిస్తారని తెలిపారు. ఈ సీట్ల కోసం దరఖాస్తు చేయదలచుకున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు వారి తల్లి లేదా తండ్రి పని చేస్తున్న గని లేదా విభాగం అధిపతుల నుంచి నిర్దేశిత నమూనాలో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని సమర్పించాలన్నారు. సోమవారం దీనిపై సింగరేణి హెచ్ఆర్డీ శాఖ వారు ఒక సర్క్యూలర్ విడుదల చేశారని తెలిపారు. వైద్య విద్య చేపట్టాలను కొనే సింగరేణి పిల్లలకు ఇది గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. -చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *