-
జర్నలిస్టుల హక్కులు,రక్షణకు నిరంత పోరాటాలు
-
ఈనెల 29న ”ఛలో ఢిల్లీ” ఆందోళన
-
పీటీఐ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు.
-
ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ తీర్మానం.
మహానది వెబ్ న్యూస్ : ఉత్తరప్రదేశ్ , 21.09.2023, దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాటాలు నిరంతరం కొనసాగించాలని, సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఐఎఫ్ డబ్ల్యూజే 125వ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈనెల19,20 తేదీలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లా బృందావన్ లో జరిగాయి. స్థానిక బృంద ఆనందం రిసార్ట్ లో ఐఎఫ్ డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు దివంగత ఇఫ్తిదా భట్టి స్మారక ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశాలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో మీడియా రంగం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు. మీడియా సంస్థ యాజమాన్యాల ధోరణులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టుల వేతనాలకు సంబంధించి కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ గా మార్చాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సమావేశం డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు కొన్నేళ్లుగా అమలవుతున్న రైల్వే రాయితీ పాస్ లను కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిందని, దీని వల్ల రైలు ప్రయాణంలో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, నిలిపి వేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీని పునరుద్ధరించాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆయా డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈనెల 29న ”ఛలో ఢిల్లీ” కార్యక్రమం చేపట్టాలని సమావేశం తీర్మానించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాలక మండలిలో జర్నలిజం వృత్తికి సంబంధం లేని వ్యక్తులు జొరబడ్డారని, అలాంటి వాళ్ళను తొలగించాలని సమావేశం డిమాండ్ చేసింది.
ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ మీడియాను కూడా చట్టం పరిధిలోకి తీసుకువచ్చి మీడియా కౌన్సిల్ లో చేర్చాలని, ఇందు కోసం కొత్త మీడియా కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సమావేశాలు డిసెంబర్ లో నేపాల్ సరిహద్దులోని బీహార్ రాష్ట్రంలో గల సీతామడి లో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు కె. విక్రమ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో ఉత్తర ప్రదేశ్ జైళ్ళు, హోంగార్డుల శాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అన్ని రంగాలలో పని చేస్తున్నవారు మానవతా దృక్పథంతో పని చేస్తూ సమాజానికి సాకారాత్మక సందేశం అందించాలని పిలుపునిచ్చారు. త్యాగం, సత్యం, మానవత, ధయ, ప్రేమ పెరగాలి. కానీ ఈర్ష్య, వ్యక్తిగత స్వార్థం పెరిగి, తప్పుడు పనుల వైపు వెళ్ళడం వల్ల సమాజంలో అనేక రుగ్మతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో పేరుకుపోయిన అనేక రుగ్మతలను రూపుమాపే శక్తి పాత్రికేయులకు ఉందని, ఆ శక్తితో సమాజంలో మంచి మార్పుకోసం పాత్రికేయులు కృషి చేయాలని కోరారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జైళ్లను సంస్కరించామని చెబుతూ…జైళ్ళ సంస్కరణలపై అనేక విషయాలను వివరించారు. ఈ సమావేశంలో
ఐఎఫ్ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విపిన్ దులియా, ఉపాధ్యక్షులు ఉపేంద్ర సింగ్ రాథోడ్, మోహన్ కుమార్, కార్యదర్శి పులిపలుపుల ఆనందం, మహిళా కార్యదర్శి కె. శాంతకుమారి, సంతోష్ చతుర్వేది, వర్కింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో భాగంగా వార్తా పత్రికలు, వార్తా సంస్థలకు చెందిన వివిధ సంఘాలతో ఏర్పడిన నేషనల్ కాన్ఫడరేషన్ సమావేశం కూడా జరుగింది. ఇందులో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే)తో పాటు ఫెడరేషన్ ఆఫ్ పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఐ), ఐజేయూ, యూఎన్ ఐ ఎంప్లాయిస్ యూనియన్(ముంబాయి), ఆలిండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ యూనియన్స్(ఎన్ ఎఫ్ ఎన్ ఈ న్యూ ఢిల్లీ)ల ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. కాన్ఫడరేషన్ అధ్యక్షుడు ఇంద్రకాంత్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి జి. భూపతి, పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ల ప్రధాన కార్యదర్శి బలరాం దహియా తదితరులు ఈ సమావేశాల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా బృందావన్ లో జరిగిన ఉత్తర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్లో పలువురు ఐఎఫ్ డబ్ల్యూజే నాయకులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.