• జర్నలిస్టుల సమస్యలపై ఐక్య ఉద్యమం జరగాలి – ఢిల్లీ ధర్నాలో జర్నలిస్టు నేతలు.

దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, నూతన చట్టాల సాధన కోసం ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని పలు జర్నలిస్టు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలు, పీటీఐ ఉద్యోగుల డిమాండ్ల సాధనకై ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీ పార్లమెంటు రోడ్డులోని పీటీఐ భవన్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే, అనుబంధ సంఘాల నాయకులు, పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ ల నాయకులు పాల్గొన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) వర్కింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఒకవైపు యాజమాన్యాలు చట్టవ్యతిరేక చర్యలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న వైఖరి వల్ల జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పీటీఐ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం అవలంభించిన అక్రమ చర్యలపై జరిగిన పోరాటాల ఫలితంగా కోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగినా… యాజమాన్యం మాత్రం న్యాయం చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. జర్నలిస్టులను అక్రమంగా తొలగించడం, వేతనాలు చెల్లించకపోవడం, వంటి మీడియా యాజమాన్యాల చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టుల హక్కుల కోసం కొత్త చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తుంటే… కేంద్ర ప్రభుత్వం ఉన్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కోడ్ లను తీసుకొస్తుందని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, జాతీయ పెన్షన్ స్కీమ్ ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని, ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా కలిసొచ్చే సంఘాలతో ఐక్య కార్యాచరణ చేపట్టాల్సి అవసరం ఉందని అన్నారు. ఈ ధర్నాలో ఐఎఫ్ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విపిన్ దులియా, ఉపాధ్యక్షులు ఉపేంద్ర సింగ్ రాథోడ్, మనోజ్ మిశ్రా, పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ల నేషనల్ కాన్ఫడరేషన్ అధ్యక్షుడు ఇంద్రకాంత్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి బలరాం దహియా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్రా అనిల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు సుతారపు అనిల్ కుమార్, వివిధ జిల్లాల టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *