- మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్
- పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు
- జర్నలిస్టుల నిరసన ర్యాలీలో వక్తలు.
హైదరాబాద్, అక్టోబర్ 06:మహానది వెబ్ న్యూస్
పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్ ఊరుకోబోమని పలువురు వక్తలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా మీడియా స్వేచ్ఛను హరిండం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తూ
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ లో జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబర్దార్, ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండించండి, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుదాం, రాజ్యాంగ హక్కులను గౌరవిద్దాం అంటూ జర్నలిస్టులు నినదించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే), తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీబీజేఏ)ల నేతృత్వంలో బాగ్ లింగం పల్లి సుందరయ్య పార్కు పరిసర ప్రాంతాల్లో జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, మాజీ ఎడిటర్ ఎస్. వినయ్ కుమార్, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, అఖిలభారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పార్ధసారధి తదితరులతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపడం సహించారనిదని అన్నారు. న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపైన, అందులో పని చేస్తున్న 47 మంది జర్నలిస్టులపైన ఢిల్లీ పోలీసులు దాడులు జరిపిన తీరు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగిస్తుందని అన్నారు. ఎందుకు సోదాలు జరుపుతున్నారో, ఎందుకు అరెస్టులు చేస్తున్నారో చెప్పకుండా చీకటి రోజులను గుర్తు చేసే విధంగా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వ్యవహరించారని, కేంద్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ఇస్తున్నారనే కక్షతో మీడియా సంస్థలను బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు. కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్న పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయడం లేదో చెప్పడం లేదని ఆరోపించారు. చైనా పెట్టుబడులను బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని హరించాలని చూస్తున్నారని ఆరోపించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని వారన్నారు. మీడియా సంస్థపైన, జర్నలిస్టుల పైన పాలకులు చేస్తున్న దాడులను ఆపకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఈ. చంద్రశేఖర్, తన్నీరు శ్రీనివాస్, హెచ్ యూజే అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీష్, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నవీన్, రాజశేఖర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.