- ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అభ్యర్థి
- సతీమణితో కలిసి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు.
- తొలి రోజు ప్రచారానికి విశేష స్పందన.
మహానది న్యూస్, ఎల్బీనగర్, అక్టోబరు 27:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆయన సతీమణి కమల సుధీర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మిగతా పార్టీల అభ్యర్థుల కంటే ముందుగానే ప్రచారం ప్రారంభించారు. శుక్రవారం నాగోల్ డివిజన్ లోని జైపురికాలనీలో డిఆర్ఎఫ్ కేంద్రం దగ్గర ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. తొలి రోజు ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా పూలవర్షంతో ఆదరిస్తూ, మహిళలు మంగళ హారతులు పట్టి నుదుట కుంకుమ తిలకం దిద్ది శాలువాలు పులమలాలతో ఘన స్వాగతం పలికారు. కొన్నిచోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీవాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నో ఏండ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో చూసి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని అన్నారు. మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. అలాగే బి.సి, ఎస్.సి, ఎస్.టి, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతు
న్నాయని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయల నిధులతో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. మరికొన్ని సమస్యలను సైతం ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ చౌరస్తాను ఫ్రీ సిగ్నల్ చౌరస్తాగా మార్చడం జరిగిందన్నారు. ఎస్.ఆర్.డి.పీ.పనుల్లో భాగంగా చాలా వరకు పనులు తుదిదశకు చేరుకోవడం జరిగిందని తెలిపారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులు పూర్తి అయ్యాయని, ఎల్.బి.నగర్ జంక్షన్ వద్ద కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, నాగోల్ జంక్షన్ ఫ్లై ఓవర్, కామినేని జంక్షన్ వద్ద రెండు వైపులా ఫ్లై ఓవర్లు, చింతలకుంట జంక్షన్ వద్ద అండర్ పాస్, బైరామల్ గూడ(ఆలేఖ్య టవర్స్) జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆలేఖ్య టవర్స్ వద్ద సెకండ్ లెవెల్ నూతన స్కైవే ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయ్యాక ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవని తెలిపారు. రాబోయే రోజుల్లో మెట్రో రైలును హయత్ నగర్ వరకు తీసికువెళ్ళేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే నాగోల్ దగ్గర నూతన సైకిల్ ట్రాక్ నిర్మాణం పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. కరోనా సమయంలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే రోడ్డు వెడల్పు పనులు, ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా చేయడం జరిగిందని గుర్తు చేశారు. అలాంటి పనుల్లో కొన్ని ఆటంకాలు రావడం జరిగిందని అయినా కూడా తాము భయపడకుండా వారిని ప్రేమతో ఒప్పించి రోడ్డు వెడల్పు పనులు చేయడం జరిగిందని తెలిపారు. అప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు స్థానిక ప్రజలు అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న వారికి 58, 59 జీవో తీసుకొనిరావడం జరిగిందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి 118 జీవో తెచ్చి వారికి ఊరట కలిగించడం జరిగిందని తెలిపారు. అలాగే కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలంలో 1200 కోట్ల రూపాయల వ్యయంతో 1000 పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. అలాగే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాగోల్ ఫతుళ్ళ గూడ వద్ద అంతర్జాతీయ స్థాయిలో స్మశానవాటిక నిర్మించడం జరిగిందని గుర్తుచేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందుకు నియోజకవర్గం ఓటర్లు మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సుధీర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయనంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, మహిళా అధ్యక్షురాలు ప్రమీల, సీతారాములు గౌడ్, ఆజాద్ నియోజకవర్గం పరిధిలోని సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, వివిధ విభాగాల కమిటీల సభ్యులు, పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.