-
మణుగూరు మున్సిపాలిటీని పంచాయతీలుగా మార్చండి
-
పనులు లేక పస్తులుంటున్న పేదలకు దారి చూపండి
-
జీరో అవర్లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మహానది న్యూస్ ,ఫిబ్రవరి .15, పినపాక నియోజకవర్గం పూర్తి ఏజన్సీ ప్రాంతం కావడంతో మణుగూరు మున్సిపాలిటీలో ఎన్నికలు లేక పాలన, అభివృద్ధి అస్తవ్యస్థంగా మారి విలీనం అయిన గ్రామాల రైతులకు వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోతున్న నేపథ్యంలో మున్సిపాలిటీని పంచాయతీలుగా మార్చాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ… 2005కు పూర్వం మణుగూరు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నదన్నారు. మున్సిపాలిటీగా మారిన అనంతరం కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరగక 19 సంవత్సరాలు దాటిందన్నారు. దీంతో పాలన, అభివృద్ధి అస్తవ్యస్థంగా మారి మున్సిపాలిటీలో విలీనం అయిన 13 గ్రామాల పేదలు, ప్రజలు వ్యవసాయ కూలీలు, ఖాళీ సమయాల్లో రైతులకు గ్రామీణ ఉపాధి హామీ పనులు అమలు జరగక జివనోపాధి లేక పస్తులుంటున్నారన్నారు. అంతేకాకుండా ఇంటి పన్నులు, నీటి సరఫరా పన్నుల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలోనూ తాను అప్పటి గవర్నర్ కు 13 గ్రామాలను నాలుగు గ్రామ పంచాయతీలుగా మార్చాలని వివరించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని వివరించారు. గిరిజనులు, వ్యవసాయ కూలీలు అధికంగా జీవించే ఏజన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణ ప్రజల జీవన విధానాలను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాయిగూడెం, కమలాపురం, అన్నారం, కుంకుడుచెట్ల గుంపు నాలుగు గ్రామ పంచాయతీలుగా చేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటిసారి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.