• జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జీవో 1395 ను సవరించాలి

  • మీడియా అకాడమీ ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకోవాలి

  • అక్రెడిటేషన్ల విధి విధానాల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి

  • మంత్రి పొంగులేటికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి.

 మహానది డిజిటల్ మీడియా : హైదారబాద్  జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించి నియమ నిబంధనల మార్పు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 1395 లోపభూయిష్టంగా,ఏకపక్షంగా ఉందని, ఈ జీవోను వెంటనే సవరించి ప్రభుత్వం వేసిన అన్ని జర్నలిస్టు సంఘాలకు, చిన్న పత్రికలకు, మహిళా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్  (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్,ఎల్గొయి ప్రభాకర్, తదితరులు శనివారం రాష్ట్ర సమాచార,పౌరసంబంధాలు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇటు ప్రభుత్వానికి,అటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ గురుతర బాధ్యతలను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు సమాజం బాగోగులే లక్ష్యంగా పనిచేస్తూ సర్కారుకు సహకరిస్తున్నారని, అలాంటి జర్నలిస్టులకు గుర్తింపు కోసం ప్రభుత్వం సమాచార శాఖ నుంచి అక్రెడిటేషన్ కార్డులను ఇస్తున్నదని అన్నారు. తెలంగాణలో 2015 లో అక్రెడిటేషన్ రూల్స్ తో పాటు జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ జీవో 239 ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందని, రూల్స్ ఫ్రేమ్ చేయడానికి మాజీ సంపాదకులు రామచంద్ర మూర్తి నేతృత్వంలో అల్లం నారాయణ, కే. శ్రీనివాస్ రెడ్డి, క్రాంతికిరణ్, కే శ్రీనివాస్ ఇతర సీనియర్ ఎడిటర్లతో కలిపి కమిటీ వేసి అక్రెడిటేషన్ ల మార్గదర్శకాలు రూపొందించారని తెలిపారు. వాటిని జీవో 239 ద్వారా ఆమోదించి గత పదేండ్లుగా అమలు చేస్తున్నారని, అయితే తాజాగా అక్రెడిటేషన్ రూల్స్ మార్చేందుకు ప్రభుత్వం జీవో 1395 ను జారీ చేసిందని, అయితే ఈ జీవో అసంబద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ జీవో కు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో లో సీనియర్ ఎడిటర్ లు కాకుండా మీడియా అకాడమీ ముసుగులో ఉన్న ఒక జర్నలిస్టు యూనియన్ చెందిన వారికే ప్రాతినిధ్యం కల్పించారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన జీవో 239 ప్రకారం మూడు జర్నలిస్టు సంఘాలకు అవకాశం ఇవ్వాలని, కానీ ఇవ్వలేదని, అలాగే చిన్న పత్రికలను, మహిళా జర్నలిస్టులను పట్టించుకోలేదని వారు మంత్రితో అన్నారు. మీడియా అకాడమీ కనుసన్నల్లో ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన ఈ కొత్త జీవోను ఖచ్చితంగా సవరించిన తరువాతే అక్రెడిటేషన్ కార్డుల నిబంధనలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. గతంలో నిబంధనలు రూపొందించిన పెద్దమనుషులే మళ్లీ ఇప్పుడు కొత్త నిబంధనల జపం చేస్తున్నారని, మీడియా అకాడమీ ముసుగులో ఉన్న ఒక యూనియన్ గానీ, మీడియా అకాడమీ గానీ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల విషయంలో వాస్తవాలు చెప్పడం లేదని విమర్శించారు. తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఆ యూనియన్ తప్పుడు చర్యలకు పాల్పడుతుందని, దానికి మీడియా అకాడమీ ఛైర్మన్ మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని జర్నలిస్టుల్లో పలుచన చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఏకపక్ష ధోరణి, తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వం విమర్శలకు గురయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పునరాలోచించి తాజా జీవో 1395 ను సవరించాలని వారు కోరారు. జర్నలిస్టు సంఘాలతో పాటు చిన్నపత్రికలకు, మహిళా జర్నలిస్టులకు కమిటీలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ హనుమంతరావుకు ఇచ్చే వినతి పత్రాన్ని జాయింట్ డైరెక్టర్ జగన్ కు సమర్పించారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు సలీమా,చంద్రశేఖర్,రాజశేఖర్,నేషనల్ కౌన్సిల్ మెంబర్ రమాదేవి, హెచ్ యూజే కార్యనిర్వాహక కార్యదర్శి నాగవాణి, పి.విజయ తదితరులు ఉన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *