జర్నలిస్టుల సంక్షేమానికి పోరాడే ఏకైక జర్నలిస్టుల సంఘం టీడబ్ల్యూజెఎఫ్: ఉప్పల్ మహాసభలో కీలక తీర్మానాలు”
తేదీ: 30/11/2024
వేదిక: ఉప్పల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
మహానది వెబ్ న్యూస్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ఏకైక జర్నలిస్టుల సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన టీడబ్ల్యూజెఎఫ్ మహాసభలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, “టిడబ్ల్యూజెఎఫ్ లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి జర్నలిస్టుకూ సభ్యత్వం కల్పించి, సమానత్వం కొనసాగిస్తామని” తెలిపారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కల్పించడానికి ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తూ ఫెడరేషన్ పోరాటం చేస్తోంది అని వెల్లడించారు.
జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం
టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ, “గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగితే పోరాటం తప్పదని” హెచ్చరించారు. జర్నలిస్టులు అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తమ హక్కుల సాధన కోసం సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
మేడ్చల్ జిల్లాలో త్వరలో మహాసభలు
రాష్ట్ర కార్యదర్శి ఎస్.కే. సలీమా మాట్లాడుతూ, “జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో మహాసభలు విజయవంతంగా నిర్వహించి, ఫెడరేషన్ బలంగా నిలిచేలా చర్యలు చేపడతామని” తెలిపారు. ఫెడరేషన్ కోసం జర్నలిస్టులు సభ్యత్వం తీసుకుని తమ హక్కుల సాధన కోసం పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఉప్పల్ టీడబ్ల్యూజెఎఫ్ నూతన కమిటీ
ఉప్పల్ నియోజకవర్గ టీడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షుడిగా గంగి కృష్ణ, కార్యదర్శిగా రామచంద్ర మూర్తి, కోశాధికారిగా నరేష్, అలాగే 13 మంది సభ్యులతో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.ఈ మహాసభకు జాతీయ కౌన్సిల్ సభ్యులు వేంపల్లి పద్మారెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తన్నీరు శ్రీనివాస్, గుమ్మడి హరిప్రసాద్, పటేల్ నరసింహులు, యావపురం రవి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ అంకితభావంతో పని చేస్తూ, సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉందని నాయకులు పేర్కొన్నారు.