మహిళల అండర్ –19 ప్రపంచ కప్ విజేత గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం
మహానది వెబ్ న్యూస్, హైదరాబాద్ ఫిబ్రవరి 05 : మహిళల అండర్ -19 ప్రపంచ కప్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన తెలంగాణకు చెందిన గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోటి రూపాయల ప్రోత్సాహక నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయంలో త్రిష కీలకపాత్ర పోషించడంతో ఆమెను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా గొంగడి త్రిష తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింత ప్రతిభ కనబరిచేందుకు ఆమెకు ఆశీస్సులు అందజేశారు.
అంతేగాక, అండర్ -19 ప్రపంచ కప్ టీమ్‌లో తెలంగాణకు చెందిన మరో క్రికెటర్ ధృతి కేసరికి రూ. 10 లక్షల నగదు బహుమతిని సీఎం ప్రకటించారు. టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలిని కు రూ. 10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు లోక్‌సభ సభ్యులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , ఎల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.