జర్నలిస్టుల సమస్యల సాధనకై నిరంతర పోరాటం – టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి
వనపర్తి, జూలై 21 (మహానది వెబ్ పోర్టల్ )
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతుందని వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి తెలిపారు. సోమవారం వనపర్తి టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన జిల్లాకొచ్చిన తొలి టీడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గ సమావేశం విజయవంతంగా జరిగింది.సభ అధ్యక్షతన మాట్లాడిన అంబటి స్వామి మాట్లాడుతూ, “ప్రజలతో ప్రభుత్వానికి వారధిగా పాత్ర వహించే జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వీరి సమస్యలపై సమిష్టిగా, నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. జర్నలిస్టులకు జీవిత భీమా, మెరుగైన వైద్య సదుపాయాలు, వారి పిల్లలకు ఉచిత విద్య కల్పించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు ఫెడరేషన్ కృషి చేస్తుందన్నారు. సంఘ బలోపేతం కోసం ప్రతి ఒక్క సభ్యుడు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని జర్నలిస్టులకు సేవలు మరింత సమర్థంగా అందించేందుకు రామకృష్ణ రెడ్డి, ముజీబ్, ప్రవీణ్, శాంతి సుజీత్‌లను సంబంధిత బాధ్యతలతో ఇంచార్జీలుగా నియమించారు. ఈ సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు సహాదేవ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నిరంజన్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, శివన్న యాదవ్, బంకల రవి, బాలముకుందం, కోశాధికారి పవన్, సహాయ కార్యదర్శులు శేఖర్, సాయిరాం, విష్ణువర్ధన్, సాగర్, కార్యవర్గ సభ్యులు చెన్నయ్య, వెంకన్నశెట్టి, ముజీబ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
– మహానది