రంగారెడ్డి, మహానది న్యూస్: గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో జిల్లా రెవెన్యూ శాఖ, సివిల్ సప్లయ్ ఇతర శాఖలు నిర్వహించిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొని పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమని, సేకరించిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చి పూజిస్తారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు. మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమం బతుకమ్మ పండుగ అని అన్నారు. మన సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. బతుకమ్మ పండుగను మహిళలంతా ఒకచోట చేరి తొమ్మిది రోజులపాటు సంతోషంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వనజాత, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
