♦ అనాధ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ
హైదరాబాద్, మహానది న్యూస్, అక్టోబర్ 11: సమాజంలో కన్నవారిని కోల్పోయి,అయినవారి ఆదరణ లేక అనాధలుగా మారుతున్న చిన్నారులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. శనివారం ఆయన తన తండ్రి కీర్తి శేషులు మామిడి రామయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎల్బీనగర్ లోని కొత్తపేటలో గల అనాధ విద్యార్ధి గృహంలో విద్యార్థుల కోసం ఆయన తన తల్లిదండ్రుల పేరిట బియ్యం, మంచినూనె, పప్పులు తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ,సమాజంలో తల్లిదండ్రులు లేక, అయిన వారి ఆదరణ లేక ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కొందరు పిల్లలను అనాధలను చేస్తున్నారని,ఇది సరైంది కాదని అన్నారు. సమాజం పట్ల సామాజిక సేవా దృక్పథం కలిగిన మార్గం రాజేష్ ఎన్నో ఏళ్లుగా అనాధ విద్యార్థుల కోసం ఆశ్రమం నడుపుతూ, ఎంతో మంది నిరుపేద అనాధ పిల్లలను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించి సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించడమే కాకుండా వారికి విద్యనందించి మంచి ప్రయోజకులను చేయడం అభినందనీయమని అన్నారు.
తన తల్లిదండ్రులు కీ.శే మామిడి రామయ్య, రంగమ్మల పేరిట ఏర్పాటు చేసిన ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వారి వర్ధంతుల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర సందర్భాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో అనాధ పిల్లలు,వృద్దులు, నిరుపేదలకు సేవలు చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదని, అందుకే ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మామిడి సోమయ్య కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, ఎల్బీ నగర్ నియోజకవర్గం కోశాధికారి నంబి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

