మహానది, చర్లపల్లి: భారత ప్రభుత్వ హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం రోజు మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రాన్ని(PAC), కేంద్ర జైలును సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జైలు, శిక్షణ సేవల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్‌ మంత్రి ని స్వాగతించి మొత్తం కార్యక్రమానికి తోడుగా ఉన్నారు. ఖైదీల వ్యవసాయ క్షేత్ర సందర్శనలో భాగంగా మంత్రి తెలంగాణ జైలు శాఖ చేపట్టిన వివిధ సృజనాత్మక, పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన అడ్వెంచర్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఓపెన్‌ ఎయిర్‌ జైళ్ల ఖైదీలు, విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, విద్యా–వినోదం ద్వారా సమాజంతో అనుసంధానం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. తదనంతరం మంత్రి ఆర్గానిక్‌ కూరగాయల తోటలు, పుష్పోత్పత్తి యూనిట్లు, ముఖ్యంగా బంతి (Marigold) పూల తోటను సందర్శించారు. ఖైదీలు స్వయం ఉపాధి, వృత్తి శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అభినందించారు. డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్‌ ఇటీవల ప్రారంభించిన తేనెటీగల పెంపకం (Bee Keeping) కార్యక్రమం గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి డెయిరీ ఫార్మ్‌ను సందర్శించి, ఖైదీలు పశుపోషణలో చూపుతున్న కృషిని అభినందించారు. అక్కడ జన్మించిన కొత్త దూడకు స్వయంగా “కృష్ణ” అని పేరు పెట్టారు.

తర్వాత మంత్రి కేంద్ర జైలును సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్‌ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అమలు అవుతున్న ఉత్తమ పద్ధతులు, పునరావాస కార్యక్రమాలు, విద్య, సంక్షేమం, ఆరోగ్య సేవలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ కుమార్‌ జైలు శాఖ చేపట్టిన ప్రగతిశీల, పునరావాస చర్యలను ప్రశంసించి, జైళ్లు ఇప్పుడు విద్యా–ప్రేరణ కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. మంత్రి జైలులోని పరిశ్రమా యూనిట్లు, ఆసుపత్రిలను పరిశీలించి, ఖైదీలతో మట్లాడారు. ఖైదీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి పట్ల జైలు శాఖ చూపుతున్న మానవీయ దృక్పథాన్ని ఆయన అభినందించారు. భవిష్యత్తులో జైలు సంస్కరణలను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్శనలో ఎన్‌. మురళి బాబు, ఐజీ ప్రిజన్స్‌; డాక్టర్ డి. శ్రీనివాస్‌, డీఐజీ ప్రిజన్స్‌; ఎం. సంపత్‌, డీఐజీ ప్రిజన్స్‌; ఎన్‌. శివ కుమార్‌ గౌడ్‌, సూపరింటెండెంట్‌, కేంద్ర జైలు చర్లపల్లి; డి. కాలిదాస్‌, సూపరింటెండెంట్‌, ఖైదీల వ్యవసాయ కాలనీ, చర్లపల్లి పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *