మహానది, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలోని సింధూర్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఎల్బీనగర్ లోని సింధూర్ ఎంక్లేవ్ కాలనీలోని యువేరా అపార్ట్మెంట్ లో స్థానికులు ఏర్పాటు చేసిన సమావేశానికి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ప్రైవేట్ టాక్సీవాళ్లు రోడ్ల పక్కనే వాహనాలు పార్కు చేస్తున్నారని, ఇదేమని అడిగితే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్కును అభివృద్ధి చేయాలని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న మధుయాష్కి గౌడ్, మల్ రెడ్డి రామ్ రెడ్డి లు త్వరలోనే అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
