♦ పది రోజుల వ్యవధిలో జరగడం యాదృచ్ఛికం
♦ ఓ సీనియర్ జర్నలిస్టు కుటుంబంలో విషాదం
♦ కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య
మహానది, హైదరాబాద్, అక్టోబర్ 16:
భర్త దశదిన కర్మ రోజే భార్య అంత్యక్రియలు జరిగిన ఓ వింత సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. భర్త చనిపోయిన పది రోజులకే భార్య గుండె పోటుతో మరణించిన ఈ సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది. భార్యా భర్తల మరణం సంఘటన ఓ జర్నలిస్టు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లా పూర్ మెట్ లో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు మేడపాటి బాబ్జీ(62) అనారోగ్యంతో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఈనెల 5వ తేదీన మరణించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య జయప్రద(58) మనో వేదనతో బెంగ పెట్టుకుని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 14వ తేదీ రాత్రి గుండెపోటుతో ప్రాణాలొదిలారు. భర్త చనిపోయి పది రోజులు (దశదిన కర్మ) కూడా పూర్తి కాకుండానే భార్య మరణించడం యాదృచ్ఛికంగా జరిగిన పోయింది. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. తెల్లవారితే తండ్రి దశదిన కర్మలు చేయాల్సిన పిల్లలు తల్లి అంత్యక్రయలు చేశారు. ఒకవైపు భర్త దశదిన కర్మలు, మరోవైపు భార్య అంత్యక్రియలు జరగడం అత్యంత బాధాకరమని కుటుంబ సభ్యులు, బంధువులంతా కన్నీటి పర్యంతమయ్యారు.

బాబ్జి కుటుంబ సభ్యులకు పరామర్శ
-ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య
సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు బాబ్జీ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని బాబ్జీ ఇంటికి వెళ్లి ఆయన బాబ్జీ కుటుంబ సభ్యులను పరామర్శి ఓదార్చారు. బాబ్జీ సతీమణి జయప్రదను పరామర్శించాలనుకుని వెళ్ళిన ఆయనకు ఆమె కూడా రెండు రోజుల క్రతమే మరణించారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. పది రోజుల వ్యవధిలోనే తల్లిని, దండ్రినీ కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను మామిడి సోమయ్య ఓదార్చారు. ఆయన వెంట ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొట్లపల్లి అశోక్ కుమార్ గౌడ్, ఎల్బీనగర్ కోశాధికారి నంబి పర్వతాలు తదితరులున్నారు.
