మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
♦ పండుగల సంధర్భంగా 1,010 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్, మహానది న్యూస్, అక్టోబర్ 21: దక్షిణ మధ్య రైల్వే పండుగల సంధర్భంగా అదనపు రద్దీని నియంత్రించడానికి ప్రయాణికుల రైలు ప్రయాణం సజావుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగడానికి తగు చర్యలు తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన గురువారం రోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మీడియా సమావేశంలో పండుగ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లపై వివరించారు. ఈ మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె. పద్మజ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా భారతీయ రైల్వేలు 12,000కి పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోందని, వీటిలో 973 ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వేకు చెందినవని తెలిపారు. గడచిన ఒక నెల కాలంలో అంటే 2025 సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు జోన్ వివిధ గమ్యస్థానాల మధ్య 1,010 రెగ్యులర్, ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను నడిపిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 684 ప్రత్యేక రైళ్లు నడపగా, దానికంటే ఇది 47శాతం ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో 4.80 కోట్ల మంది ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, స్పెషల్ రైళ్లలో (వచ్చే రైళ్లు&వెళ్ళే రైళ్లు) ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులకు ప్రయాణ వసతిని కల్పించడానికై వివిధ రెగ్యులర్ రైళ్లకు 237 అదనపు కోచ్‌లను జోడించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన టెర్మినళ్లపై భారాన్ని తగ్గించడానికి లింగంపల్లి , హైటెక్ సిటీ, చర్లపల్లి , మల్కాజ్‌గిరి వంటి కొన్ని స్టేషన్లలో రైళ్లకు అదనపు స్టాప్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జోన్ వ్యాప్తంగా ప్రధాన స్టేషన్లలో చేపట్టిన సమగ్ర రద్దీ నియంత్రణ సౌకర్యాల చర్యల గురించి జనరల్ మేనేజర్ వివరించారు. సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్, లింగంపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, రాయచూర్, గుంతకల్లు , గుంటూరు, నల్గొండ, కాచిగూడ, నిజామాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, అకోలా, పూర్ణ వంటి ఆరు డివిజన్లలోని ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లపైకి రద్దీ నియంత్రిత చర్యలో భాగంగా 26 హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హోల్డింగ్ ప్రాంతాలలో తగినంత సీటింగ్, లైటింగ్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయని అన్నారు. స్టేషన్, జోనల్, రైల్వే బోర్డు స్థాయిలో పర్యవేక్షణతో అన్ని ప్రధాన స్టేషన్లలో సి.సి.టి.వి నిఘా జరుగుతోందని తెలిపారు. సికింద్రాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు వంటి ఎనిమిది స్టేషన్లలో అదనపు బుకింగ్ కౌంటర్లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. డివిజనల్ అధికారుల దగ్గరి పర్యవేక్షణలో ఆర్.పి.ఎఫ్ సిబ్బంది, టికెట్ చెకింగ్ సిబ్బంది, ప్రభుత్వ రైల్వే పోలీసులు, నిర్వహణ సిబ్బంది మొదలైన వివిధ విభాగాలకు సంబంధించిన అదనపు సిబ్బందిని కూడా నియమించారు. రద్దీ రోజులలో స్టేషన్లలో 24 గంటల పర్యవేక్షణ కోసం ఆపరేటింగ్, కమర్షియల్, ఆర్.పి.ఎఫ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఎస్&టి వంటి విభాగాల నుండి అధికారులు, సూపర్‌వైజర్లతో కూడిన సంయుక్త బృందాలను ఏర్పాటు చేసినట్లు జనరల్ మేనేజర్ హైలైట్ చేశారు. అంతేకాకుండా, అన్ని డివిజన్లు, జోనల్ ప్రధాన కార్యాలయాలలో వార్ రూమ్‌లు/రైల్ మదద్ సౌకర్యాన్ని బలోపేతం చేశారు. అదనపు అవసరాలను తీర్చడానికి స్టేషన్లలోని క్యాటరింగ్ స్టాళ్లను అప్రమత్తం చేశారు. ఐ.ఆర్.సి.టి.సి సమన్వయంతో ఆన్-బోర్డ్ క్యాటరింగ్ సేవలను ఏర్పాటు చేయడమైనది. అధిక ఛార్జీలు, అనధికార విక్రయాలు మొదలైన కేసులను నివారించడానికి తనిఖీలు నిర్వహించామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తరువాత, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు, రద్దీ నియంత్రణ చర్యలు, ప్రయాణీకుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు మొదలైన వాటిని ఆయన సమీక్షించారు. జనరల్ మేనేజర్ ప్రయాణీకుల సౌకర్యాలు, వెయిటింగ్ హాళ్లలో శుభ్రత, మరుగుదొడ్లు, నీటి ఏర్పాట్లు మొదలైన వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఉన్నారు.
