మహానది, ఎల్బీనగర్: నవంబర్ రెండో తేదీన జరిగే రాక్ టౌన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రెండు వారాలు వాయిదా వేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారి చతుర్వేదిని కోరారు. శనివారం సొసైటీ కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, ఆల రవీందర్ రెడ్డి,సభ్యులు ఇంద్రారెడ్డి, కె.శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, దాసరి పవన్ తదితరులు సొసైటీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ని కలిసి 60 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సొసైటీ ఎన్నికలు ఏకపక్షంగా, నియమావళికి విరుద్దంగా నిర్వహిస్తున్నారని, మూడోవంతు సభ్యుల హాజరు లేకుండానే జనరల్ బాడీ నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు నిర్ణయాలు చేశరని ఆరోపించారు. సొసైటీ లో ఉన్న 850 మంది సభ్యులలో కేవలం 72 మంది సభ్యులు మాత్రమే జనరల్ బాడీ సమావేశానికి హాజరయ్యారని, ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టి ఈనెల 23న ఓటర్ల తుది జాబితా ఫైనల్ చేశారని అన్నారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని,వీటిని సరిదిద్దకుండానే హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని అన్నారు. ఓటర్ల జాబితాను పూర్తి చేసిన తర్వాతే ఎన్నికల తేదీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రేపటి నుంచి జరిగే నామినేషన్ల ప్రక్రియను ఆపాలని, ఎన్నికల తేదీని అదనంగా రెండు వారాలకు వాయిదా వేయాలని వారు డిమాడ్ చేశారు.
