తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్

మహానది, హైదరాబాద్:హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సహచర జర్నలిస్టులను ఉద్దేశించి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఒక జర్నలిస్టు యూనియన్ కు అధ్యక్షుడుగా ఉండి తోటి జర్నలిస్టులను విషసర్పాలని, బుడ్డర్ ఖాన్ లని, కొన్ని జర్నలిస్టు సంఘాలను బుడ్డ సంఘాలు అంటూ కించపర్చడం, దూషించడం, తూలనాడడం సరైంది కాదని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు. విషసర్పాలన్నీ ఏకమైనా తమను ఏమీ చేయలేకపోయాయంటూ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయి పోస్టులు పెట్టడం జర్నలిస్టులను బాధించిందని అన్నారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా గెలుపు లక్ష్యంగా అందరూ అవగాహనతో లేదా కూటమిగా ఏర్పడి పోటీ చేయడం సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో ప్యానెల్ లోపోటీ చేసినా, స్వతంత్రంగా పోటీ చేసినా గెలుపు ఓటములు సహజమని, అంతమాత్రాన ఓడిపోయిన జర్నలిస్టులను ఉద్దేశించి విరాహత్ అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదని వారన్నారు. విరాహత్ అలీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, సహచర జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వల్ల జర్నలిస్టులకు ఒరిగిందేమిటో, జర్నలిస్టుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పకుండా ఎన్నికల పేరుతో ఒక వర్గం, ఒక యూనియన్ పెత్తనంతో క్లబ్ ను తమ కబంధహస్తాల్లో పెట్టుకొని ఆటాడుతున్నారని ధ్వజమెత్తారు.  మంచి వాతావరణంలో జరగాల్సిన ప్రెస్ క్లబ్ ఎన్నికలను గందరగోళం చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయం చేయడం, సభ్యులను తప్పుదోవ పట్టించడం     బాధాకరమని అన్నారు. నిన్న జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు, అదేవిధంగా ప్రజాస్వామ్య స్పూర్తితో ఎన్నికల్లో  పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన అభ్యర్థులకు వారు అభినందనలు తెలిపారు. గెలుపొందిన నూతన కార్యవర్గం రాబోయే రెండేళ్లలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి, యూనియన్ లకు తలొగ్గకుండా ప్రెస్ క్లబ్ అభివృద్దికి, సభ్యుల సంక్షేమాని కృషి చేయాలని వారు కోరారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *