హైదరాబాద్, మహానది:
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 10గంటలకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ లు తెలిపారు. సొసైటీకి సంబంధించిన పలు విషయాలపై సర్వసభ్య సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్లస్థలాల సాధన కోసం 2008 లో ఏర్పడిన ఈ సొసైటీలో దాదాపు 1400 మంది జర్నలిస్టులు సభ్యులై ఉన్నారని, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం 17 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని,ఇండ్ల స్థలాలు పొందకుండానే చాలా మంది జర్నలిస్టులు చనిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొసైటీకి స్థలం ఇవ్వాలని కోరుతూ ముఖ్య మంత్రికి, మంత్రులకు పలు మార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని, అయినప్పటికీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తుందని వారు ధ్వజమెత్తారు.నవంబర్ 5వ తేదీన జరిగే సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణపై కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అత్యంత కీలకమైన ఈ సర్వసభ్య సమావేశానికి సొసైటీ సభ్యులందరు తప్పని సరిగా ఉదయం 10 గంటల కల్లా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
