మహానది, హైదరాబాద్ :
సీనియర్ జర్నలిస్టు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు చెరుకూరి రంగయ్య నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు.ఆయనకు భార్య జాన్సీలక్ష్మీ, కూతురు హిమబిందు ఉన్నారు. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన అందరికీ సిఆర్ నాయుడుగా సుపరిచితులు. యాభై ఏళ్ల పాటు ఆయన యూఎన్ ఐ, ఈనాడు,ఉదయం, వార్త తదితర ప్రధాన తెలుగు పత్రికల్లో పని చేశారు. ఆ తర్వాత అనేక చిన్న, మధ్య తరహా పత్రికల్లో కూడా పని చేశారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో తుదిశ్వాస విడిచారు. పత్రికా రంగంలో ఇన్నేళ్ళు జర్నలిస్టుగా పని చేసినా తాను ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందలేకపోయాననే బాధను రంగయ్య నాయుడు చాలా సార్లు బాధపడేవారు. 2008లో ఆయన గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా చేరారు. రంగయ్య నాయుడు బౌతిక కాయానికి గురువారం ఉదయం పటాన్ చెరు రామచంద్రాపురంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
సీఆర్ నాయుడు మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
సీనియర్ జర్నలిస్టు సి.రంగయ్య నాయుడు మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రంగయ్య నాయుడు మృతికి ఆయన సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో ఆయన అందించిన అక్షర సేవలు మరువలేనివని పేర్కొంటూ నివాళులర్పించారు.
