దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయురాలు ఇందిరమ్మ
మణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31:
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మణుగూరు మండలం ప్రజా భవన్ ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ఇందిరా గాంధీ చేసిన సేవలను స్మరించారు. సభలో మాట్లాడిన ఆయన దేశ తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ దేశ అభివృద్ధి, ఐక్యత కోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఎన్నో సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొని భారతదేశాన్ని బలమైన దేశంగా తీర్చిదిద్దిన నాయకురాలిగా ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, భూమిలేని పేదలకు భూములు పంచి ప్రజల మనసుల్లో ‘ఇందిరమ్మ’గా నిలిచిన మహానీయురాలని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పేద ప్రజలకు ఆశ్రయంగా నిలిచిన ఇల్లు ప్రతీ ఒక్కరి హృదయంలో ఆమె స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. దేశ ప్రగతికి మార్గం చూపిన నాయకురాలిని స్మరించుకునే రోజు ఇది అని చెబుతూ ఆమెకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, కాటబోయిన నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మైనారిటీ అధ్యక్షుడు రహీం పాషా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

