పినపాక మండలం లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు – జాతీయ స్థాయికి మార్గం సుగమం
మణుగూరు, మహానది న్యూస్, అక్టోబర్ 31:
నేషనల్ గేమ్స్, స్టేట్ మీట్ ఆటల పోటీలు నిర్వహణపై సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం మణుగూరు మండలం ప్రజా భవన్ ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో జరిగింది. సభలో మాట్లాడిన ఆయన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల లోపు బాలబాలికల కబడ్డీ పోటీలు పినపాక మండలంలోని ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించబడ్డాయని తెలిపారు. ఈ పోటీలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, విద్యా శాఖ పర్యవేక్షణలో నవంబర్ 8, 9, 10 తేదీలలో ఘనంగా జరుగనున్నాయని వివరించారు.
ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుండి బాలబాలికల జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు ఉంటారు. మొత్తం 300 మంది క్రీడాకారులు, 100 మంది రెఫరీలు పాల్గొననున్నారు. ప్రో కబడ్డీ మ్యాట్‌పై పగలు, రాత్రి ఫెడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించబడతాయి. క్రీడాకారులు, అధికారులు కోసం భోజనం, వసతి సౌకర్యాలు మరియు పోటీల నిర్వహణ ఖర్చులు కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భరించబడతాయి. రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేసి పంపుతారు. జనవరి 7 నుండి 11 వరకు పినపాక మండలంలోని ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి బాలుర పోటీలు జరగనున్నాయి. బాలికల జట్టు మహారాష్ట్రలోని అహల్య నగర్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటుంది. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలానికి జాతీయ స్థాయి పోటీలు కేటాయించడం చారిత్రాత్మకమని, ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సుమారు 650 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లో జరగడం ద్వారా గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి పెరిగి, వారు కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి.సంకీర్త్, పీడీ వీరన్న, ఎంఈఓ నాగయ్య, పినపాక మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, కాటిబోయిన నాగేశ్వరరావు, మైనారిటీ అధ్యక్షుడు రహీం పాషా, లారీ యూనియన్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, దున్నపోతుల శ్రీను, మండల నాయకులు సుబ్బారెడ్డి, పాతూరి వెంకన్న, పాలమూరి రాజు తదితరులు పాల్గొన్నారు
