ఉక్కుమనిషి చూపిన దారిలో యువత ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్
దేశ ఐక్యతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి ఆదర్శం : ఎస్పీ రోహిత్ రాజు
*భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, అక్టోబర్ 31*:
దేశ సమగ్రత, ఐక్యత కాపాడటంలో ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు నేటి తరానికి మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవం లో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటంలో ఉక్కుమనిషి పాత్ర అపూర్వమని, భారతదేశంపై జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలను ఎదుర్కోవడంలో ప్రజలంతా ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. యువత తమ ఆలోచనలు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలని, దేశాన్ని ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు అక్టోబర్ 21 నుండి నిర్వహించబడినట్లు తెలిపారు.
తరువాత జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్ మాట్లాడుతూ ఉక్కుమనిషి నిర్ణయాలు దేశ ప్రజలకు ధైర్యం, దిశ చూపించాయని చెప్పారు. సంస్థానాల విలీనంతో భారతదేశాన్ని ఐక్యరూపం ఇచ్చిన పటేల్ కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని ప్రతీ ఏడాది ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తరువాత కలెక్టర్, ఎస్పీ రైల్వే స్టేషన్ వద్ద జెండా ఊపి రన్ ఫర్ యూనిటీ ప్రారంభించి స్థానికులు, విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పరిగెత్తారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, ఆరో బెటాలియన్ అదనపు కమాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

