మహానది, ఎల్బీనగర్:
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రాక్ టౌన్ కాలనీలో నవంబర్ 16న జరుపతలపెట్టిన కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలను రద్దు చేయాలని పలువురు సొసైటీ సభ్యులు ఎన్నికల అధికారిని కోరారు. సొసైటీ ఓటర్ల జాబితాను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సొసైటీ సభ్యులు మామిడి సోమయ్య, కృష్ణమోహన్ రెడ్డి, ఆల రవీందర్ రెడ్డి, కల్వకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, సీతారాంరెడ్డి, కొండల్ రెడ్డి, ఇంద్రారెడ్డి,వెంకటరెడ్డి తదితరులు మరోసారి సొసైటీ కార్యాలయంలో ఎన్నికల అధికారి చతుర్వేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సొసైటీ సభ్యులలో ఓటు వేయడానికి అర్హత ఉన్న సభ్యులతో కాకుండా అర్హత లేని మొత్తం సభ్యులతో ఓటర్ల జాబితాను రూపొందించి, అదే ఓటర్ల జాబితాగా ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబిత పూర్తిగా తప్పుల తడకగా ఉందని, వెంటనే జాబితాను సవరించాలని తాము ఇప్పటికే రెండు సార్లు కోరామని,అయినా జాబితాను సవరించకుండా జాప్యం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. సొసైటీలో దాదాపు 863 మంది ఓటర్లు ఉండగా వీరిలో చాలా మంది ఓటర్లు కాదని తెలుస్తుందని, చాలామంది ఓటర్ల చిరునామాలు, ఫోన్ నెంబర్లు లేవని ఆరోపించారు. అంతే కాకుండా స్థానిక అడ్రస్ లో లేని ఓపెన్ ప్లాట్ యజమానులైన ఓటర్లను గుర్తించేందుకు ఎటువంటి ఆధారం లేకుండా బోగస్ ఓటర్లతో ఓట్లు దండుకునే అవకాశం ఉందని, అలాంటి ఓటర్ల స్థానికతను నిరూపించే గుర్తింపు పత్రాలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించి సొసైటీ ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్పటి దాకా ఎన్నికలు నిలిపివేయాలని వారు కోరారు.
