విద్యార్థుల చదువు, ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 1: పినపాక నియోజకవర్గ ప్రజాప్రతినిధి పాయం వెంకటేశ్వర్లు లంక మల్లారం గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ మోడల్ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం) మరియు అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి నైపుణ్యాన్ని పరీక్షించారు. సాధారణ ప్రశ్నలతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు చక్కగా చదువుతున్నారని ప్రశంసిస్తూ, మరింత అభివృద్ధి సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. భోజనం తయారీలో ఉపయోగించే పదార్థాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. స్టోర్‌రూమ్‌లో గోధుమపిండి, ఇతర ఆహార పదార్థాలు తెరిచి ఉంచిన విషయం గమనించి, అవి కలుషితం కాకుండా సురక్షితంగా భద్రపరచాలని సూచించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను పలకరించి వారికి అందిస్తున్న భోజనం, వసతి, బోధన విధానం, రోజువారీ కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

