తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ జెండా ఎగురింది – మణుగూరులో ఉద్రిక్తత
మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 1:
మణుగూరు పట్టణంలో ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వందల సంఖ్యలో తెలంగాణ భవన్ వైపు దూసుకెళ్లి ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కార్యాలయంలోని ఫర్నిచర్‌ను బయటకు తీసి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో మంటలు చెలరేగి పరిసర ప్రాంతమంతా పొగమంచుతో కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసు బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ శ్రేణుల ఉధృతిని నియంత్రించలేకపోయాయి.
బిఆర్ఎస్ శ్రేణులను కార్యాలయం నుండి బయటకు పంపించబడగా, పార్టీ జెండాలను కిందికి దించి, కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరిపారు.
కాంగ్రెస్ శ్రేణుల ప్రకారం – “ఈ భవనం ఒకప్పుడు మాజీ ప్రజా ప్రతినిధి రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఇందిరా భవన్‌గా నిర్మించబడింది. తరువాత పార్టీ మార్పుతో తెలంగాణ భవన్‌గా మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో, మళ్లీ తమ సొంత భవనాన్ని తిరిగి పొందాం” అని పేర్కొన్నారు.
సంఘటన తర్వాత మణుగూరు ప్రాంతంలో పోలీసులు భారీ బలగాలతో మోహరించి పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు. పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.

