పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుల నాయకత్వం అత్యవసరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, నవంబర్ 04:

జిల్లాలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల సక్రియ పాత్ర అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం సుజాతనగర్ జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల ఆకస్మికంగా పరిశీలించారు.

పాఠశాలలో పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, సౌకర్యాలు, నిర్వహణ వంటి అంశాలను సమీక్షించిన కలెక్టర్, స్వచ్ఛత కాంపైన్ 5.0 కార్యక్రమం కింద చేపట్టిన పనులపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఆ రోజు చేయవలసిన పనులు సక్రమంగా జరగకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధి కేవలం భవన నిర్మాణం లేదా వసతుల పెంపు మాత్రమే కాదని, అది సమగ్ర ప్రక్రియగా భావించాలన్నారు. విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలు ప్రధానోపాధ్యాయుల దిశానిర్దేశంపై ఆధారపడి ఉంటాయని సూచించారు. టాయిలెట్లను పరిశీలించిన సందర్భంగా కొన్ని తాళం వేసి మూసివేసినట్లు గమనించి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వెంటనే టాయిలెట్లను తెరిపించి మరమ్మతులు పూర్తి చేయాలని పాఠశాల నిధుల ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి సదుపాయాలు తగిన స్థాయిలో లేవని గమనించి, కొత్త బోర్ ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు మరియు మిషన్ భగీరథ విభాగానికి సూచించారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీరు నిరంతరంగా అందేలా చూడాలని ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాల కావడంతో ఆటస్థల అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి, విద్యార్థుల క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు అన్ని ఆటల మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, సమూహ భావన పెరుగుతుందని అన్నారు. పాఠశాల వెలుపల నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రం పరిశీలనలో, భవనం తక్కువ ఎత్తులో ఉండటంతో వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉందని గమనించి, ఎత్తు పెంచి మిగతా పనులు కొనసాగించాలని ఇంజినీరింగ్ శాఖకు సూచించారు. భవిత కేంద్రాలు పాఠశాలలకు విలువైన వనరుల కేంద్రాలుగా మారాలని, నిర్మాణ నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *