ఉత్పత్తి లక్ష్య సాధనపై దృష్టి సారించిన సింగరేణి – రక్షణతో కూడిన పనితీరు అవసరం
మణుగూరు, మహానది న్యూస్, నవంబర్ 06:
సింగరేణి సంస్థ ప్రతి రోజు రెండు లక్షల నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించడంతో పాటు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ వర్షాల కారణంగా తొలి అర్ధ సంవత్సరంలో తలెత్తిన లోటును పూడ్చుకొని నవంబర్ నెలలో 72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ ఎన్. బలరామ్ ఆదేశించారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, కార్పొరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఏరియాల వారీగా ఉత్పత్తి, రవాణా, రక్షణ అంశాలను విశ్లేషించారు.
సమావేశంలో బలరామ్ మాట్లాడుతూ, మైనింగ్‌తో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఒక్క ఫైలు కూడా పెండింగ్‌లో ఉండకూడదని, పనితీరులో అలసత్వం సహించబోమని హెచ్చరించారు. రక్షణ ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ ప్రమాదరహిత సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన మూడు ప్రమాద మరణాలు పునరావృతం కాకుండా ఈ సంవత్సరం ఒక్క ప్రమాదం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో తనిఖీలు పెంచాలని సూచించారు.
కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్ గనికి అవసరమైన అనుమతులు లభించినందున వచ్చే మార్చి నాటికి కనీసం ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. ఈ సంవత్సరం నలుగు కొత్త గనులను ప్రారంభించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని ఈసారి ప్రత్యక్షంగా నిర్వహించి, ఏరియాల అవసరాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఎం. తిరుమల రావు, ఈడి కోల్ మూమెంట్ బి. వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగేన్, జనరల్ మేనేజర్ సమన్వయం మరియు మార్కెటింగ్ టీ. శ్రీనివాస్, ఇతర కార్పొరేట్ విభాగాల అధికారులు ప్రత్యక్షంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

