కబడ్డీ సౌత్ జోన్ జాతీయ స్థాయిలో మెయిన్ రైడర్‌గా గరికపాటి శాంభవి చౌదరి ఎంపిక
అశ్వాపురం, మహానది న్యూస్, నవంబర్ 06:
అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన గరికపాటి కొండలరావు, నాగమణి దంపతుల కుమార్తె గరికపాటి శాంభవి చౌదరి కబడ్డీ క్రీడలో విశిష్టత సాధించింది. సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీలలో మెయిన్ రైడర్‌గా ఎంపికై ప్రతిభ చాటింది.
శాంభవి చౌదరి హైదరాబాదులోని గట్‌కేసర్ ప్రాంతంలో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నది. బాల్యదశలోనే కబడ్డీ పట్ల ఆసక్తి పెంచుకుని, విద్యతో పాటు ఆటల్లోనూ ప్రతిభ కనబరుస్తూ పాఠశాల తరఫున మండల స్థాయిలో అనేక బహుమతులు అందుకుంది.
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుండి కళాశాల తరఫున క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరుకుంది. అక్టోబర్ 23న జేఎన్‌టీయూ కళాశాలలో దిలీప్, అశోక్ సమక్షంలో జరిగిన ఎంపికల్లో జేఎన్‌టీయూ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికైంది.
తదనంతరం అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు చెన్నైలోని వినాయక మిషన్ పరిశోధనా సంస్థలో జరిగిన సౌత్ జోన్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని మెయిన్ రైడర్‌గా ఎంపికైంది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధువులు శాంభవిని అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలంగాణకు, కళాశాలకు, స్వగ్రామానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.

