జిల్లా ఆరోగ్య సేవలపై సిఆర్ఎం బృందం సమీక్ష – ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం
భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, నవంబర్ 06:
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిఆర్ఎం (కామన్ రివ్యూ మిషన్) బృందం జిల్లా ఆరోగ్య వ్యవస్థపై సమీక్షా సమావేశం నిర్వహించింది. సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షత వహించి, ఆరోగ్య కార్యక్రమాల అమలు, సేవల నాణ్యత, సిబ్బంది పనితీరు అంశాలను సమీక్షించారు.
సమావేశంలో జిల్లా ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలవుతున్న కార్యక్రమాలు, వైద్య సేవల పురోగతి, ప్రజలకు అందుతున్న సదుపాయాలపై విస్తృత చర్చ జరిగింది. సిఆర్ఎం బృంద సభ్యుడు డాక్టర్ గురిందర్ బీర్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య సేవలు సక్రమంగా అమలవుతున్నాయని, మాతా–శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ, గ్రామీణ వైద్య సేవల విస్తరణలో గణనీయమైన పురోగతి సాధించిందని అభిప్రాయపడ్డారు.
బృందం ఐదు రోజులపాటు జిల్లాలో పర్యటించి కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఈ.రామవరం మాతా శిశు ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రి, చర్ల, ఇల్లందు, గుండాల, ఎస్ఎన్పురం, సుజాతనగర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, శేఖర్ బంజరా, రామవరం, లచ్చగూడెం, ముత్తాపురం, నమిడిగూడెం, ధన్బాద్, చాతకొండ, తెగడ, దానవాయిపేట వంటి ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సేవల అమలును పరిశీలించింది.
అదనంగా టీ హబ్ కొత్తగూడెం, సెంట్రల్ మెడిసిన్ నిల్వ కేంద్రం, క్రిటికల్ కేర్ బ్లాక్ వంటి కేంద్రాలను పరిశీలించి ఆరోగ్య సదుపాయాల నాణ్యతను సమీక్షించింది. బృంద సభ్యులు పరిశీలన వివరాలను పవర్ పాయింట్ రూపంలో వివరించి, సిబ్బందికి తరచూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆశా, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బృంద సూచనలను తక్షణమే అమలు చేసి, ప్రజలకు చేరే వైద్య సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు, సదుపాయాల సులభ ప్రాప్యత, ప్రతి స్థాయిలో సమన్వయం ద్వారా ఆరోగ్య సేవలు బలోపేతం కావాలని సూచించారు.
జిల్లా ఆరోగ్య సిబ్బంది కృషితో ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్ఠంగా ముందుకు సాగుతుందని, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో రాష్ట్రం కొత్త ప్రమాణాలు సాధించే దిశగా అడుగులు వేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
సమావేశంలో సిఆర్ఎం బృంద సభ్యులుగా డాక్టర్ బి. వెంకట శివారెడ్డి, డాక్టర్ అజయ్ పాండే, డాక్టర్ అంకిత కాంకర్య, డాక్టర్ అనర్ సింగ్ డాకర్, డాక్టర్ కల్పనా భవానియ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ ఎస్. విజయలక్ష్మి, అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవిబాబు, డాక్టర్ మధువరన్, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ స్పందన, డాక్టర్ తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

