సికింద్రాబాద్, మహానది న్యూస్, నవంబర్ 10:
కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్; సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్; దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పరిపాలనా అధికారి/నిర్మాణం రణధీర్ రెడ్డి; దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మాణంలోనున్న స్టేషన్ భవనం రెండు వైపులా కొనసాగుతున్న పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాలలో తీసుకుంటున్న భద్రతా చర్యలను కూడా ఆయన సమీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి స్టేషన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడిందని, నేడు ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా ఉందని, రోజుకు 1.97 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, రోజుకు 100 కి పైగా రైళ్లు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తున్నాయని అన్నారు. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి ఈ స్టేషన్‌ను రూ. 714.73 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రయాణీకుల సౌకర్యాలు, ఆధునిక నిర్మాణంతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిగ్నల్స్, ట్రాక్‌లు మరియు రైలు సేవలకు అంతరాయం లేకుండా నిర్మాణ పనులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రద్దీ సమయాల్లో (గంటకు దాదాపు 23,000 మంది ప్రయాణికులు) ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, రైలు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయాలతో సమానంగా ప్రపంచ ప్రమాణాలతో స్టేషన్‌ను పునరాభివృద్ధి చేస్తున్నామని ఈ స్టేషన్ హైదరాబాద్ నగరంలో ఒక ఆకర్షణ కేంద్రంగా ఉండబోతుందని ఆయన తెలియజేశారు.
ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలను వివరిస్తూ, 3 ఎకరాల స్థలంలో డబుల్ స్టోరీ స్కై కాన్కోర్స్, 3,000 మంది ప్రయాణీకులకు వసతి కల్పించే సామర్థ్యంతో వెయిటింగ్ హాల్ కోసం స్థలం, రెస్టారెంట్లు, రిటైల్ కేంద్రాలు, వినోద సౌకర్యాలు; 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు; 5000 కిలోవాట్ల సోలార్ ప్లాంట్; అధునాతన భద్రతా వ్యవస్థలు, రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు; వర్షపు నీటి ఇంకుడు గుంటలు; తూర్పు & పశ్చిమ మెట్రో స్టేషన్ల స్కైవేతో పాటు బస్ స్టేషన్ మొదలైన వాటితో అనుసంధానించే నడక మార్గాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ పనులు దశలవారీగా చేపట్టబడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ పూర్తవుతుందని, దక్షిణం వైపు బ్లాక్ రాబోయే 4 నెలల్లో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరం వైపు భవనం, ప్లాట్‌ఫారమ్‌లు, కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మొత్తం ప్రాజెక్టును డిసెంబర్, 2026 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక వేసినట్లు ఆయన తెలిపారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను పునరాభివృద్ధి చేస్తున్నామని, పని పూర్తయిన తర్వాత రోజుకు 2.7 లక్షల మంది ప్రయాణికులకు, గంటకు 32,500 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తుందని గౌరవ మంత్రి అన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,337 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలలో, తెలంగాణలో 346 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాలు, 487 కిలోమీటర్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులు పూర్తిచేయబడి మన్నికలోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పదేళ్లలో రికార్డు స్థాయిలో 1959 ట్రాక్ కిలోమీటర్ల విద్యుదీకరణ జరిగిందని, తెలంగాణలో 100శాతం విద్యుదీకరణ పూర్తయిందని ఆయన అన్నారు. అదేవిధంగా, గడచిన 10 సంవత్సరాలలో 293 ఆర్‌యుబీలు, 43 ఆర్.ఓ.బిలు, 49 ఎఫ్.ఓ.బి లు నిర్మించబడ్డాయని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న కొమరవెల్లి రైల్వే స్టేషన్ పనులు 96 శాతం పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. యాదాద్రికి ఎం.ఎం,టి.ఎస్ రెండవ దశ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ఇటీవల ప్రారంభించబడ్డాయని తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందే భారత్ రైలు నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కవచ్ ఇతర ఆధునిక సిగ్నలింగ్ అంశాలను వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో . సికింద్రాబాద్ ఇరిసెట్లో ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయబడిందని కూడా ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 42,219 కోట్లు అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు .
