ఖమ్మం, మహానది న్యూస్, డిసెంబర్ 8:

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) లక్ష్యం అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు అందించడమేనని వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

 

టీడబ్ల్యూజేఎఫ్‌ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సంఘం పేరును దుర్వినియోగం చేస్తూ జర్నలిస్టులను గందరగోళానికి గురిచేయాలని ప్రయత్నించే ప్రయత్నాలను పట్టించుకోవద్దని సూచించారు. వ్యవస్థాపక సభ్యులు జిల్లాలవారీగా పర్యటిస్తూ సంఘ బలోపేతం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా మహాసభను త్వరలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో రెండు సంవత్సరాలు గడిచినా జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రభుత్వం తక్షణ స్పందన చూపాలని డిమాండ్ చేశారు. ప్రతిస్పందన రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం స్వతంత్రంగా పని చేసే ఏకైక సంఘంగా టీడబ్ల్యూజేఎఫ్‌ను గుర్తించాలన్నారు.

 

ఐఎఫ్‌డబ్ల్యుజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మీడియా వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఐఎఫ్‌డబ్ల్యుజే పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు, సీనియర్‌లకు పెన్షన్ పథకం వంటి కీలక అంశాలపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.

 

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలతో పాటు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, వేతన భద్రత, వృద్ధాప్య పెన్షన్, అక్రెడిటేషన్ విధానాల్లో పారదర్శకత వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఉద్యమం చేపట్టనున్నట్లు మామిడి సోమయ్య తెలిపారు. త్వరలో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి దశలవారీగా కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

ఖమ్మం జిల్లా జర్నలిస్టులు సంఘ పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొని బలమైన జిల్లా కమిటీ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సీనియర్ జర్నలిస్టుల మార్గదర్శకత్వం ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్నపెద్ద పత్రికలతో సంబంధం లేకుండా అందరి ఐక్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

 

సమావేశంలో పాల్గొన్న పాత్రికేయులు టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధాంతాలను సమర్థిస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమిష్టి పోరాటమే జర్నలిస్టుల హక్కులను సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

అంతకుముందు ఖమ్మం జిల్లా అడ్‌హాక్ కమిటీని రాష్ట్ర కమిటీ ప్రకటించింది. కన్వీనర్‌గా టీ. సంతోష్ చక్రవర్తి, కోకన్వీనర్లుగా అర్వపల్లి నగేష్‌, అంతోటి శ్రీనివాస్‌, నానబాల రామకృష్ణ‌, వందనపు సామ్రాట్‌లను నియమించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రాష్ట్ర, జిల్లా కమిటీలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *