ఎల్.బి.నగర్, మహానది న్యూస్, ఏప్రిల్ 5 :
భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఎల్.బి.నగర్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎల్.బి.నగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడని పేర్కొన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, పరిపాలన నిపుణుడైన ఆయన.. జాతీయ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అణగారిన తరగతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని వివరించారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయమని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఆడాల రమేష్, చింతల రవికుమార్, నర్సింహా, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
