హైదరాబాద్, మహానది న్యూస్, మే 20:
ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తీవ్ర వేడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, వడదెబ్బ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్ రావు హెచ్చరించారు. ప్రతి వేసవిలో ప్రమాదకర అనారోగ్యాలు లేకపోయినా వడదెబ్బ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందువల్ల దీనిపై సరైన అవగాహన అవసరమని తెలిపారు.
వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ అనేది వేసవిలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలోని సహజ శీతలీకరణ వ్యవస్థ విఫలమై ఏర్పడే అత్యంత ప్రమాదకర పరిస్థితి. శరీర ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువకు చేరినప్పుడు ఇది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుందని చెప్పారు. వడదెబ్బ తగిలిన వారిలో సుమారు 20 శాతం కేసులు మరణానికి దారితీయవచ్చని పేర్కొన్నారు.
అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు, చర్మం ఎర్రబడటం, వేగంగా శ్వాస తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా భావించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. హీట్ స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అని, చికిత్స ఆలస్యమైతే కీలక అవయవాల వైఫల్యం, తీవ్రమైన డీహైడ్రేషన్, అపస్మారం, మూర్ఛ, కొన్నిసార్లు మరణం కూడా సంభవించే అవకాశముందని తెలిపారు. కొంతమంది బాధితుల్లో మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు.
శిశువులు, చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఎండలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేసే వారు, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం చికిత్సలో ఉన్నవారు, యాంటీడిప్రెసెంట్ మరియు ఇమ్యూనోసప్రెసెంట్ మందులు వాడేవారిలో వడదెబ్బ త్వరగా తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఇంట్లోనే ఉన్నప్పటికీ, ముఖ్యంగా రేకుల షెడ్లలో నివసించే వారు, సరైన గాలి వెలుతురు రాని ఇళ్లలో ఉండేవారు కూడా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
వడదెబ్బ లక్షణాల్లో జ్వరం, కండరాల తిమ్మిరి, అధిక చెమటలు, బలహీనత, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, గుండెదడ, ముదురు రంగు మూత్రం, పాలిపోయిన చర్మం, అపస్మారం వంటి సమస్యలు ఉంటాయని తెలిపారు.
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న చల్లని ప్రదేశానికి తరలించి, నుదురు, మెడ, శరీరాన్ని తడి గుడ్డతో తుడవాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి తగిలేలా చూడాలని, రోగికి స్పృహ వచ్చిన తర్వాత పండ్లరసం, ఉప్పు-చెక్కర కలిపిన ద్రవం, కొబ్బరి నీరు, మజ్జిగ, బార్లీ వంటి ద్రవాలు ఇవ్వాలని చెప్పారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ప్రతి పది నిమిషాలకు శరీర ఉష్ణోగ్రతను కొలుస్తూ, ఉష్ణోగ్రత 38.5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా చూడాలని తెలిపారు. అవసరమైతే సెలైన్ ఎక్కించాల్సి ఉంటుందని, తీవ్ర వడదెబ్బ తర్వాత కొంతకాలం పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారు.
వడదెబ్బ నివారణకు వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలని, తరచూ మంచినీరు తాగాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మధ్యాహ్న వేడి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదన్నారు. వేసవిలో మద్యం వాడకం తగ్గించి, మజ్జిగ, దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ, అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. తేలికపాటి వ్యాయామం, టోపీ, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ వాడటం ద్వారా కూడా వడదెబ్బను నివారించవచ్చని తెలిపారు.
హోమియోపతిలో వడదెబ్బ నుంచి ఉపశమనం కోసం అనేక మందులు ఉన్నాయని డాక్టర్ దుర్గాప్రసాద్ రావు తెలిపారు. లక్షణాలను బట్టి గ్లోనోయిన్, బెల్లడోన, నేట్రం మూర్, జెల్సీమియం, పల్సటిల్ల వంటి మందులు వాడవచ్చన్నారు. అలాగే ఎకోనైట్, ఫెర్రమ్ ఫాస్, కాక్యులస్, క్యాంఫర్, థెరిడియాన్ వంటి ఔషధాలు కూడా ఉపయోగపడతాయని చెప్పారు.
నేట్రం మూర్ లేదా గ్లోనైన్ 30 పొటెన్సీ మందులను ఉదయం, సాయంత్రం తీసుకుంటే వడదెబ్బ నివారణకు ఉపయోగపడుతుందని, వడదెబ్బగా అనుమానం ఉన్న రోగులకు నాట్రమ్ కార్బ్ 30 లేదా 200 మంచి ఫలితాలు ఇస్తుందని వివరించారు. అయితే ఏ మందైనా స్వయంగా వాడకుండా, తప్పనిసరిగా అర్హత కలిగిన హోమియో వైద్యుని సలహా మేరకే ఉపయోగించాలని సూచించారు.
