పట్టణాభివృద్ధి దిశగా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ప్రాధాన్యం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, మహానది న్యూస్, నవంబర్ 04:
అమృత్ 2.0 పథకం కింద జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఇందుకోసం అవసరమైన ఖచ్చితమైన వివరాలను ప్రతి శాఖ సమయానికి అందించాలని ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో డీటీసీపీ ప్రాజెక్టు అధికారి అశ్విని ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సమావేశం నిర్వహించబడింది.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ పట్టణ భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకం అవుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ నుంచి లభించే సర్వే నంబర్లు, భూమి వినియోగ వివరాలు వంటి సమాచారం ప్రణాళికలో కీలకమని వివరించారు.
త్రాగునీటి సరఫరా అంశంపై ప్రజారోగ్య మరియు మిషన్ భగీరథ శాఖలు సమన్వయంతో సమాచారాన్ని సమర్పించాలని సూచించారు. రోడ్లు, భవనాలు శాఖలు ప్రస్తుత రహదారులతో పాటు భవిష్యత్తులో అవసరమయ్యే బైపాస్ మార్గాల ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ, విద్యుత్, రవాణా, రైల్వే, పరిశ్రమల శాఖలు తమ పరిధిలోని సమగ్ర వివరాలను అందించాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల స్థానాలు కూడా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి, వచ్చే ఇరవై సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ప్రాదేశిక సమాచారాన్ని సేకరించాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూ వినియోగ పటాలు సిద్ధం చేయవచ్చని, తాజా డేటా ఆధారంగా ప్లాన్‌ను నిరంతరం నవీకరించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్ పట్టణాభివృద్ధి, భవన నిర్మాణం, రవాణా మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు పునాది వేయవచ్చని వివరించారు. జనాభా పెరుగుదల మరియు పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకొని గృహాలు, త్రాగునీరు, రహదారులు మరియు ఇతర సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ఆర్‌డిఓలు, తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు.
సమగ్ర సమాచార ఆధారంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఆర్‌డిఓ మధు, సి పి ఓ సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ సుజాతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

