ఐఎఫ్‌డబ్ల్యూజే స్పూర్తితో జర్నలిస్టుల ఐక్యత – హక్కుల సాధనకు నూతన దిశా నిర్దేశం
హైదరాబాద్, మహానది న్యూస్, నవంబర్ 05:
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధనలో ఐఎఫ్‌డబ్ల్యూజే పోరాట పటిమ చరిత్రాత్మకమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. భారత దేశంలో మొట్టమొదటి జర్నలిస్టు సంఘంగా 1950 అక్టోబర్ 28న స్థాపితమైన ఈ సంస్థ, ఏడు దశాబ్దాలుగా జర్నలిస్టు వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని గుర్తు చేశారు.
ఐఎఫ్‌డబ్ల్యూజే 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ముప్పై వేల మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 28 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాల సంఘాలతో ఐఎఫ్‌డబ్ల్యూజే సంబంధాలు కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు, సంక్షేమ పథకాలు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఐఎఫ్‌డబ్ల్యూజే కృషి కొనసాగిస్తోందని తెలిపారు. కనీస వేతన బోర్డు అమలు చేసి జర్నలిస్టులకు న్యాయమైన వేతనాలు అందించాలన్నది ప్రధాన లక్ష్యమని వివరించారు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు అందించి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి గృహ స్థలాలు, ఇండ్లు, అక్రెడిటేషన్ కార్డులు అందించాలన్నది ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. ఐఎఫ్‌డబ్ల్యూజే స్పూర్తితో జర్నలిస్టుల హక్కుల సాధనకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, చిర్రా శ్రీనివాస్, పొట్లపల్లి అశోక్ కుమార్ గౌడ్, పాండురంగారావు, బొల్లం శ్రీనివాస్, నాగవాణి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

