ఢిల్లీలో జర్నలిస్టుల ధర్నా
– తరలివెళ్ళన తెలంగాణ జర్నలిస్టు నేతలు.
హైదరాబాద్ , సెప్టెంబర్ 28:
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, పీటీఐ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టుల రక్షణ చట్టం చేయాలనే తదితర డిమాండ్లతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే), నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈనెల 29 న ఛలోఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పార్లమెంటు రోడ్డులోని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) వద్ద జరిగే ధర్నాలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే నాయకులు, పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ల నాయకులు పాల్గొంటారు. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు ఇరవై మంది ఐఎఫ్ డబ్ల్యూజే అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు శనివారం తరలివెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యతో పాటు హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల నుంచి ఫెడరేషన్ నాయకులు ధర్నాకు బయలుదేరి వెళ్లారు.
