దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిరుద్యోగ యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ యువత స్వయంగా ఏర్పాటు చేసుకున్న “ఆస్పరెంట్ అడ్డా–టీ పాయింట్” వద్ద నిరుద్యోగులతో కలిసి టీ తాగుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో నిరుద్యోగ యువతను కలిసి పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
ముఖ్యంగా ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని, పారదర్శక నియామక వ్యవస్థ తీసుకువస్తామని, “జాబ్ క్యాలెండర్” విడుదల చేస్తామని, నిరుద్యోగ భృతి అంశాన్ని పరిశీలిస్తామని, గ్రూప్స్, డీఎస్సీ తదితర నియామకాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువత సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో ప్రకటించిందన్నారు.
అలాగే ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించిన “యూత్ డిక్లరేషన్”లో తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ తదితర నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు అందిస్తామని, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుతామని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను సమయానికి విడుదల చేస్తామని, గిగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారని గుర్తు చేశారు.
ఈ హామీలను నమ్మి యువత గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరిందని, కానీ ఇప్పుడు ఆ హామీలు అమలు కాక నీటి మూటలయ్యాయని విమర్శించారు. ఉద్యోగాల ఊసే లేకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశలోకి నెట్టిందని మండిపడ్డారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు.
అదేవిధంగా జీవో 29, జీవో 46లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపి పారదర్శక దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ భారస నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, శంకర్, శింబు నాయక్, భూక్యా కుమార్, నవీన్ పట్నాయక్, సింధురెడ్డి, ఆకాష్, అంజలి, శ్రీదేవి, అశోక్, నందు, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
