ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్ పరికరాన్ని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ, వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా ఆధ్వర్యంలో  ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, ఆరు నెలల క్రితం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహకారంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి సీటీ స్కాన్ పరికరం మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు సేవలు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రత్యేకంగా గర్భిణీలు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు సీటీ స్కాన్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాలనీవాసులు సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి, ఆసుపత్రి అధికారులను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. అవసరమైతే ఈ అంశాన్ని మరోసారి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు త్వరితగతిన సీటీ స్కాన్ సేవలు అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.

ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ సానుకూలంగా స్పందించి, వారంరోజుల్లోపు సీటీ స్కాన్ పరికరాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొలిశెట్టి సంజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, శ్రీధర్ రావు, లగ్గొని శ్రీధర్ గౌడ్, ఆనంద్ రాజు, శక్తి కిషోర్, పరమేశ్వర్ గౌడ్తో పాటు ఇతర నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *